You are currently browsing the daily archive for మార్చి 20th, 2007.

శ్రీ రామ రామ రామేతి రమే రామ మనోరమే

సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే

 

శ్రీనివాసునకును స్తిరముగా మ్రొక్కుచు హృదిని నిల్పి బ్రహ్మ సతిని గొల్చి

నీవు మెచ్చునట్టి నీతివాక్యములను విన్నవించుకొందు వెంకటేశ!!

 

శ్రీ వెంకటేశ యనుచును యా వెంకటపతిని దలచి అర్చనతోడన్

సేవించు భక్తకోటికి భావింపగ మోక్షమబ్బు భాగ్యంబమరున్!!

 

కలియుగ వైకుంఠముగా వెలసినదీ క్షేత్ర మహిమ లెందును గనలే

మలివేలు మంగతోదుత వెలసిన వాడాయె గిరిని వేంకటపతియై!!

 

కడు శ్రమ కోర్చిన వారై పడికట్లను దాటుకొంచు వత్తురు నీకున్

ముడుపుల నిత్తురు వారిన్ విడువక దరిజేర్చు కొనుము విశ్వవిభుడవై!

 

వెనువెంట పరుగు లిడుచును జనువారల గనుడు మీరు జగదభిరామున్

గనుడదె రథమున గూర్చుండిన తెరగును గనుడదె యతడే శ్రీపతియౌ!!

 

ఏడు గిరులపై వెలసిన వాడే బాలాజి యతని పాడుచు కొలువన్

ఈడేరు కోర్కెలన్నియు నేడేబ్రహ్మోత్సవంబు నెలవున గనుడీ!!

 

వేదములకు నెలవు వేంకటగిరియని ముక్తకంఠమునను ముందువారు

పలికి కీర్తనలను పాడి తరించిరి విశద పరతునయ్య వెంకటేశ!!

 

దేశదేశములను దివ్య తిరుపతులను కట్టినారు భువిని కలియుగమున

ఎందు చూడ నీదు లీలలే కనుపించు విన్నవించుకొందు వెంకటేశ!!

 

కోరికొలుచువారి కొంగుబంగారమై ఆపదలనుబాపి ఆదరమున

దరినిజేర్చుకొనుచుదరిశెనమీయగా విన్నపంబుసేతు వెంకటేశ!!

 

రక్తి గల్గి నరుడు రంభను గూడుట భక్తి గల్గి పిదప శక్తి గొలుట

శక్తి భక్తి రక్తి శాంభవి మాయలై విశ్వ మందు వెలయు వెంకటేశ!!

 

తెలియకుండ జేయ తప్పులెన్నియొ కల్గు బుద్ధిలేక ఆత్మ శుద్ధిలేక

అట్టివారి దయను దరిజేర్చుకొననీవె విన్నవింతునయ్య వెంకటేశ!!

 

కానిపనుల కొన్ని కఠినాత్ములై జేసి పైన వేసు కొంద్రు పాపములను

నీదు దరిశెనమున నీల్గు పాపములన్ని విన్నవింతునయ్య వెంకటేశ!!

 

కానిమాటలాడ కలుగునా మోక్షము సులభ సత్య వాక్కు పలుక వలయు

గురుల మాటలెపుడు గుర్తుగా గమనింత్రు వినుత శీలురెపుడు వెంకటేశ!!

 

సత్యవాక్కు పలుక జనత నమ్మకయున్న సత్యమాడ వలదు జిత్తులకడ

సత్యమాడగవలె సచ్చరిత్రుల కడ వినుతశీల వినగ వెంకటేశ!!

 

తల్లి దండ్రి మాట తలపున నిల్పక ఆడి తప్పు వాడు అధముడగును

మాటమీద నిలచు మనుజుడే మాన్యుడు విబుధ వర్యుడగును వెంకటేశ!!

 

ఈతిబాధలువడి యీధరిత్రిని గల పుణ్యపురుషులంత పూర్వమందు

సత్యవాక్కు పలికి సత్కీర్తి బడసిరి విన్నపంబు సేతు వెంకటేశ!!

 

నిర్మలత్వమూని నిశ్శంక సేవింప సులభమార్గ మొకటి కలదు వినగ

భక్తవత్సల యని పలికిన చాలురా విశ్వ విభుడ వీవె వెంకటేశ

 

సీ!! కొండలలోనున్న కోనేటిరాయని

కాతిథ్య మిచ్చిన కానయేది?

ఆదిమధ్యాంత రహితుడైన వానికి

నాలంబమునైన యడవి యేది?

దుష్ట శిక్షణమున శిష్ట రక్షణమున

కాస్పదుడగు వాని హర్మ్యమేది?

పాపచింతనలేని పావనమతులకు

ముక్తి నొసంగెడి పురమదేది?

 

తే!గీ!! తిరుమలేశుడు వెలసిన తిరుమలగిరి

వెంకటేశుడు యున్నట్టి వెంకటాద్రి

శ్రీనివాసుడు నివసించు చిత్పురంబు

గాక యవనిలో మరియేదిగలదు చెపుమ!!

 

సీ!! చిరుతప్రాయము నందు చిరునగవొలికించి

పూతన జంపిన పుత్రుడెవరు?

గోవర్ధనంబెత్తి గోవుల గాపాడి

కాళీయు జంపిన బాలుడెవరు?

గోడలదాటుచు గొల్లభామల యిండ్ల

వెన్నభుజించిన వెన్నుడెవరు?

మాపటి వేళల గోపకాంతల జేరి

సరసాలు సాగించు సరసుడెవరు?

 

తే!గీ!! తాను గోపకిశోర బృందావిహారి

కంస సంహారి దేవకి కన్నబిడ్డ

ముదము గలుగ యశోదకు ముద్దుబిడ్డ

నందగోపాల కృష్ణుండె నాకుదిక్కు!!

 

వేంకటపతి దయగల్గిన సంకటములు తీరు పిదప సముచితరీతిన్

సంకల్పము లీడేరును పంకజనాభుండె సాక్షి పడి వడి కొలుడీ!!

 

రక్తి పుట్టి పిదప భక్తి పుట్టును చాల

రక్తి యున్న చోట భక్తి గలుగు

భక్తిచేత ముక్తి పరిపూర్ణ మగునట

వివరమింతె తెలియ వెంకటేశ!!

 

సప్త స్వరము లట్లు సప్త గిరుల మీటి

దాటి చేరవలె సధాము చెంత

చేరగానె యతడు చేరువ యగునట

వివరమింతె తెలియ వెంకటేశ!!

 

కీడు గలుగ గలదె యేడుకొండలవాని

కొలిచి పూజసేయ మేలు కలుగు

కలను యతని మరువ కలుగును దు:ఖము

వివరమింతె తెలియ వెంకటేశ!!

 

మన్ను దిన్న నిన్ను వెన్న దిన్నావంచు

పలుక గోపకాంత పాడి గాదు

మన్నుకున్న మహిమ మానవులకు లేదు

వివర మింతె తెలియ వెంకటేశ!!

 

స్వామి భక్తియున్న చాత్తాదులను గాంచి

స్వామి గృహమునుండి సాహసించి

వెడల గొట్టువారు వెతజెందు చుందురు

విషయమర్మ మింతె వెంకటేశ!!

 

కానివారి పట్ల కనికరమ్మును జూపి

అయినవారి పట్ల నాదరమును

జూపువారినరసి కాపాడుచుందురు

వినుత శీలురెపుడు వెంకటేశ!!

 

చుట్ట పక్క ములను చులకనగా జూసి

వెలయగా విమతుల చెలిమి జేసి

వేశ్య పొందులరసి విరివిగా జెడుదురు

వీరి గావు మయ్య వెంకటేశ!!

 

తల్లి పడెడి బాధ తనయుడాలింపడు

ఆలి వగవ గానె జాలి జూపు

లోక ధర్మ మిదియె లోగుట్టు తెలియరు

వీరి గావు మయ్య వెంకటేశ!!

 

తల్లి దండ్రి విడిచి తనవారి విడిచియు

వరుని వెంట నడచి వచ్చు వనిత

నమ్మినట్టి సతిని నట్టేట ముంతురు

వెర్రివారు వారు వెంకటేశ!!

 

తనదు గర్భమందు నవమాసములు మోసి

పెక్కులిడుముల బడి ప్రేగు దెంచి

జన్మమిచ్చు జనని చరితార్థు రాలని

విన్నవించు కొందు వెంకటేశ!!

 

ధనము కూడ బెట్టి తన వారికివ్వక

తాను దినక దాన ధర్మమిడక

లోభి యైన వాని లోకము మెచ్చదు

వివరమింతె దేవ వెంకటేశ!!

 

అధికమైన దాన మన్ని దానములలో

అన్న దాన మొకటి అధిక ప్రియము

అఖిల జనుల కెల్ల అన్నంబు వెట్టుచూ

వెలుగుచుంటివయ్య వెంకటేశ!!

 

సంచితార్థములను శ్రమ కోర్చి సాధించి

కూడ బెట్టువాడు కుడువబోడు

తాను దినుచు పరుల దినిపింపగా జేయ

వెనుకవచ్చు ముక్తి వెంకటేశ!!

 

కులము గోత్రముండి బలమెంతయో గలిగి

కలిమియుండి తుదకు కరుణలేని

వానిబ్రతుకు జూడ పాప భూయిష్టము

విశద పరుప నెంతు వెంకటేశ!!

 

ఎంత చదువు చదివి ఎన్ని నేర్చినగాని

మూర్ఖు డవగుణంబు ముద్దులాడు

విద్య గుణము లేక విఖ్యాతి నొందదు

విన్నవింతు నయ్య వెంకటేశ!!

 

తెలుగు వారి యొక్క తెలివి తేటగ నుండు

నేటి యువత కదియె మేటి భవిత

తెలివి గెలివి గలిగి తెలివిగా మసలిన

విజయ మందగలరు వెంకటేశ!!

 

చదువు లెన్నియైన చదువగా వచ్చును

ప్రతిభ లేని చదువు పనికి రాదు

ప్రతిభ యున్న చదువు రయమున నేర్చిన

విజయపథము దొరకు వెంకటేశ!!

 

మానవత్వమున్న మనిషి రూపము నెత్తి

వచ్చు వైద్యుని గని భరతమాత

పొంగి పొరలి శక్తి పొందుచున్నది చాల

విజయ పథము చేరి వెంకటేశ!!

 

విద్య లందు వైద్యవిద్య పవిత్రము

ప్రాణికోటి నరయు పలువిధముల

పావనమయమైన వరమంత్ర జలమగు

విన్నవింతు నయ్య వెంకటేశ!!

 

మంచి నేస్తుడల్లె మరియాద జూపించి

కీడు సేయు వాడు కాడు హితుడు

అట్టివాని స్నేహ మరసి చెడుట జూడ

విస్మయంబు గలుగు వెంకటేశ!!

 

పాలు నీరము వలె వర్ధిల్ల స్నేహము

కయ్య మెపుడు రాదు నెయ్యమునకు

బేధ భావము వీడ బీదసాదల యందు

వివిధ దశలనుండు వెంకటేశ!!

 

మనసు నందు నొకటి మదిబయలొకటిగా

తలచు కొనుట తప్పు తగదు సఖుడ

తలచినట్టి మంచి త్వరితముగా జేసి

విజయ మందు టొప్పు వెంకటేశ!!

 

ఆడుదాని జూచి యాలింగనము జేసి

రతియుసల్ప నరుడు రాక్షసుడగు

తనను నమ్ముకొన్న తనసతి యుండగా

వేరుచింతలేల వెంకటేశ!!

 

అన్య సతులగూడి అన్యాయమై పోయి

నట్టివారు తుదకు నడ్డి విరిగి

చిప్ప చేతి కూడు నొప్పున తిందురు

విషయమర్మ మింతె వెంకటేశ!!

 

మంచి చెడులనునవి మనలోనె యున్నవి

చెడును వీడి మంచి చేయనొప్పు

బాగు కోరువారు మహిమాన్వితులు గారె

విన్నవింతు నయ్య వెంకటేశ!!

 

తరతమంబు లెంచి తనవారు పగవార

లనుచు వేరుసేయ హీనగుణము

మనుజులంద రొకటె మహిలోన పూజ్యులు

విన్నపాలు సేతు వెంకటేశ!!

 

వేష భాష జూచి మోసపోవగ నేల

వేష కారి మిగుల దోష కారి

చంద్రు డైన గాని యింద్రుడైనను గాని

వేష మిడువ బాగు వెంకటేశ!!

 

ఒకరు చేయు పని మరొకరికి నచ్చదు

తాను చేయు పనియె తనకు నచ్చు

లోకరీతి యిదియ లోకులు కాకులు

విన్నవింతునయ్య వెంకటేశ!!

 

కార్య శూరుడైన కడుశ్రమ తనదైన

మనుజు డందు విజయ మందగలడె

దైవ బలము లేక తాను జయించునా

వివరమడుగ వలదు వెంకటేశ!!

 

సిరిగలదని మగువ శీలమునకు వెల

గట్టి యంపు వారు కఠిన జనులు

ధర్మపరులు మెచ్చు ధర్మంబు గాదది

విబుధ వర్యులకును వెంకటేశ!!

 

కార్యమునకు దగిన కారణ ముండును

కార్య కారణముల కథలు వినగ

కార్య కారణముల కాణాచి హరియని

విన్న వింతునయ్య వెంకటేశ!!

 

ఊరి బాగు కోరి భూరి విరాళము

న్నిచ్చి బాగుసేయ వచ్చు కీర్తి

ఆత్మ మురియు దాన అపకీర్తి దొలగును

విన్నవింతు నయ్య వెంకటేశ!!

 

దేవళమ్ము గట్టి దేవుని బంధించి

సొమ్ము సేయ ముక్తి సొంతమగునె

బ్రతుకు దెరువు జూపు బాటయే యగునది

వేరుగాదు వినగ వెంకటేశ!!

 

తల్లి దండ్రులె గద తమ భాగ్య దాతలు

మరువదగదు వారి మదిని నెపుడు

వారి సేవలోన తరియింపవలె సుతుల్

విన్నవించు కొందు వెంకటేశ!!

 

న్యాయశాస్త్ర మంత అన్యాయమే యగు

ధర్మ శాస్త్ర మేమొ తప్పు తడక

జ్యోతిషమ్ము జూడ నీతి విహీనమౌ

వివర మడుగ నేల వెంకటేశ!!

 

మాట వినని యట్టి మానవు లుండరు

వినక పోయె నేని విడుము వారి

ప్రజల మనసు దెలిసి మంచిగా పల్కుము

విన్న వింతు నయ్య వెంకటేశ!!

 

ప్రాణి విడిచి యాత్మ పరలోకమేగుచో

ప్రాణ సఖియు గృహము పాడిరాదు

కలిమి బలిమి రాదు కడ హితులును రారు

వెంట ధర్మ మొచ్చు వెంకటేశ!!

 

కరుణ యున్న వాని కలిమి ప్రకాశించు

కరుణ లేక యున్న కటికజనుడు

దీపమున్న యిల్లు దేదీప్య మానమౌ

వెలుగు పంచు నటుల వెంకటేశ!!

 

ఎందరో మహానుభావులు…
అందరికి నా నమస్సుమాంజలులు!
Sita Rama Lakshmana
ఆ సీతా రామ లక్ష్మణ ఆశీస్సులతో ఈ సంవత్సరం అందరికి మేలు జరగాలని కోరుకొంటూ

రవి తిరువాయిపాటి

 

మార్చి 2007
సో మం బు గు శు
     
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Top Posts

  • ఏమీ లేవు